Monday, March 29, 2010

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా

ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ప్రస్తుతానికి అవసరమైనవి కొందామని కొట్టుకు వెళ్ళాను. రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలొ ఇంటి వద్ద ఉన్న ఒకే ఒక సూపర్ మార్కెట్ మూసివేయడం జరిగింది. అందుకని కిరాణా కొట్టుకు వెళ్ళక తప్పలేదు.

కొట్టు పై మెట్టు మీద నుంచుని, సామాన్ల చీటీ షాపు యజమాని శంకర్ సేట్ కి అందించాను. సూపర్ మార్కెట్లో కొనడం అలవాటై, ఈ అనుభవం వింతగా అనిపించింది. తూకం సరిగ్గా చెస్తాడో లేదో,వస్తువుల నాణ్యత ఎలా వుందో, చేతులు శుభ్రంగా కడిగాడో లేదో అని నా మనసు పరి పరి విధాలా అలోచిస్తోంది. నా ప్రశ్నకే సమాధానం అన్నట్టుగా బెల్లం తూకం చెసి, వేళ్ళకి అంటిన బెల్లాన్ని సాంతం నాకేసాడు, షాపులోని కుర్రాడు. అదే చేత్తో కిలో శనగపప్పు తూకం చేసాడు. ఇంకొక ఘన కార్యం చేసాడు. అది type చేయడానికి నా చేతులు రావట్లేదు. ఇంతలో, వాడి cell phone "రింగ రింగ రింగ రింగ రే" అని మ్రోగింది. నా పాపిష్టి కళ్ళతో చూసిన దృశ్యానికి, విన్న ఆ దరిద్రపు పాటకి వెరసి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కళ్ళు మూసుకుని "రంగ రంగ రంగ రంగ హే" అని ఆ శ్రీ రంగ నాథుని మనసులో తలచుకున్నాను.

"మీ సామాన్లు ready సార్" అన్న సేట్ మాటలతో కళ్ళు తెరిచాను. అన్నీ వున్నాయో లేవో అని చూస్తే పెసరపప్పు కనిపించలేదు నాకు.

"సేట్, షాపులో పెసరపప్పు లేదా?" అని అడిగాను.

"మినపప్పు వుంది సార్", అన్నాడు.

"నేను అడిగింది పెసరపప్పు", సేట్ మాటలు సవరిస్తూ అన్నాను.

"కావాలంటే పుట్నాల పప్పు కూడ వుంది సార్", అన్నాడు.

"అవసరం లేనిది అంటగడతావెందుకు, నాకు కావలసింది పెసరపప్పు. వుందా లేదా చెప్పు" అని అడిగాను కాస్త కటువుగా.

"ఏం సార్. ఇంత చదువుకున్నారు. ఆమెరికా పోయి వచ్చారు. వ్యాపారం చేసే వాళ్ళు 'లేదు' అని అనకూడదు. వ్యాపారం దెబ్బ తింటుందని మా సెంటిమెంట్ సార్. ఈ విషయం తెలీదా మీకు" అని చిలిపిగా నవ్వాడు.

అమెరికా పోయి రావడానికి, ఈ వ్యాపార మర్మం తెలియడానికి సంబంధం ఏమిటో నాకు అంతు చిక్క లేదు. "ఇప్పుడే తెలిసింది, ఈ సారి జాగ్రత్త పడతానులే", అన్నాను ఇబ్బందిగా.

"మొత్తం నాలుగు వందలా ఇరవై రూపాయలు అయ్యింది సార్ బిల్లు" అన్నాడు సేట్.

ఎండలతో బాటు ధరలు కూడ మండిపోతున్నాయి అని గొణుగుతూ 500 నోటు అందించాను సేట్ కి.

"సార్, ఇరవై రూపాయల నోటు వుందా, మీకు వంద ఇస్తాను, అన్నాడు సేట్.

"వంద నోటు వుంది, కావాలా" అని అడిగాను.

"నాకు ఇరవై కావాలి సార్", అన్నాడు సేట్.

"పోనీ, యాభై తీసుకో అన్నాను" నోటు అందిస్తూ.

"సార్, నేను అడిగింది ఇరవై. యాభై వందా ఎందుకిస్తున్నారు?" అని అడిగాడు సేట్

"నీవు నేర్పిన విద్యయే శంకర్ సేటూ" అన్నాను.

"నాకేమీ అర్థం కాలేదు" అన్నట్టు మొహం పెట్టాడు శంకర్ సేట్.

"ఆమెరికా పొయి వచ్చినవాళ్ళు జేబులో చిల్లర లేకపోతే, 'లేదు' అనే పదం ఉచ్చరించరు. అలా అంటే జేబులో ఎప్పటికీ డబ్బులు వుండవని వారి గట్టి నమ్మకం. హైదరాబాదులో పదిహేను సంవత్సరాలుగా రెండు షాపులు నడుపుతున్నావు, ఈ మాత్రం తెలీదా నీకు?" అన్నాను చిరుమందహాసంతో.

ఈ సారి ఇబ్బంది పడడం శంకర్ సేట్ వంతైంది.

గమనిక:


1. "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా" ఒక పద్యంలోని చివరి పాదం అన్న విషయం తెలిస్తే చాల సంతోషం. తెలియక తెలుసుకోగోరితే మరింత సంతోషం. ఆ పద్యం కృష్ణార్జునుల యుద్ద సమయంలో అర్జునుడు కృష్ణునికి అంటించిన చురకలో భాగం (వామనావతారంలో బలి చక్రవర్తిని మూడడుగులు అడిగిన విషయాన్ని గుర్తు చేస్తూ). అక్షర దోషాలుంటే మన్నించి సవరించగలరు.

అదితి కశ్యపులకు గుజ్జువగుచు పుట్టి
అడుగుకొనలేదె మూడడుగులీవు
భిక్షమెత్తుకొనుట కొత్త విద్య కాదయా
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా

2. ఎవరి నమ్మకాలు వారివి. ఆ మాటకొస్తే, ఈ పొస్టింగ్ లోని మొదటి వాక్యం చదవండి. సరుకులు నిండుకున్నాయి అన్నానే గాని లేవు అనలేదు కదా!

1 comment:

  1. హరి,

    శైలి చాలా బాగుంది. కథా వేగం, pace of the story కూడా సరిపోయింది. రింగ రింగ విని రంగ రంగ అనుకోవడం బాగా పండింది.

    Keep writing.

    ReplyDelete