ఇంట్లో ఒక్కడినే ఉన్నాను. ఏమీ తోచక నా మిత్రులు రవి గోపీలను ఇంటికి రమ్మన్నాను, బాతాఖానీ కొట్టొచ్చని. ఇంటి పోరు తప్పుతుందనో మరే చేతనో అరగంటలో ఇద్దరూ నా ఇంట్లో వాలిపోయారు.
"ఏదన్నా మంచి సినిమా పెట్టరా, కాలక్షేపం అవుతుంది", అన్నాడు రవి.
"సినిమా చూడ్డానికి వీడింటికి రావాలా. చతుర్ముఖ పారాయణం (పేకాట) చేద్దాం" అన్నాడు గోపి. అదే వాడు చేసిన తప్పు.
"మరి నాలుగు ముఖాలు లేవుగా, అందుకని అది cancel" అన్నాను నేను, ఎలాగూ ఓడతానని తెలిసి.
"మరేం చేద్దామో నువ్వే చెప్పు", అన్నాడు గోపి.
"కాసేపు టీవీలో వార్తలు చూద్దాం" అని TV9 ఛానల్ పెట్టాను.
"ఎప్పుడూ TV9 ని తిడుతూ వుంటావు, మరి ఆ ఛానల్ పెట్టావేం?", law point లాగాడు రవి.
"హిరణ్య కశిపుడు హరి ద్వేశి, కానీ ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తుంటాడు, అలాగే ఇది కూడా", అన్నాను నేను.
"వీడెప్పుడూ అంతే, ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటాడు", గొణిగాడు గోపి. ఇంకా ఏదో అనేంతలో చేయి అడ్డం పెట్టి వారించాను, టీవీ volume పెంచుతూ.
స్వప్న వార్తలు చదువుతోంది. " తిరుమలలో కొత్త వివాదం రాజుకుంది. ఈ సారి గొడవ వడగళ, తెంగళ వర్గాల మధ్య నామం ఎలా పెట్టుకోవాలి అన్న విషయంలో. అటు అర్చకులు ఇటు జియ్యంగార్లు.." అని ఇంకా చెప్పబోతుండగా కరెంటు పోఇంది.
"ఈ వడగళ తెంగళ ఏంట్రా, వడగండ్లు, తెగుళ్ళు లాగా" అడిగాడు రవి.
"ఆవి రెండు వర్గాలు, వైష్ణవ మతంలో. అర్చకులు ఎక్కువగా వడగళ వర్గం, జియ్యంగార్లు తెంగళ వర్గం. వడగల వారు నామం 'U' ఆకారంలో పెడ్తారు. తెంగళ వారు ఆ 'U' ఆకారం కింద ఒక గీత కూడ పెడతారు, ముక్కు మీదగా. ఉదాహరణకి, వెంకటేశ్వర స్వామి నామానికి గీత వుంటుంది. అదే, నరసింహ స్వామికి వుండదు".
"అంటే, వెంకటేశ్వరుడు తెంగళ, నరసింహ స్వామి వడగళ, అంతేగా" అన్నాడు రవి. "చూసావా, ఎలా పట్టేసానో" అన్న అర్థం ధ్వనించింది అతని మాటలో.
"వైష్ణవులు వారిలో వారు కొట్టుకుని కల్పించినవే ఈ వడగళ తెంగళ. వాటిని దేవుళ్ళకి కూడ ఆపాదించడం ఏమిట్రా నీ బొంద" అన్నాన్నేను.
"అది సరే, ఇంతకీ ఏ నామం పెట్టుకోవాలి. వడగళ నామమా తెంగళ నామమా?" అడిగాడు గోపి.
"వడగళ నామమే బాగుంటుంది, చూడ్డానికి సింపుల్గా", అన్నాడు రవి.
"కాదు, తెంగళ నామమే కరెక్టు, సాంప్రదాయంగా వుంటుంది", అన్నాడు గోపి.
ఎటూ తేల్చుకోలేక చివరికి నా వైపు తిరిగి "ఇంతకీ ఏ నామం పెట్టుకోవాలి?" అడిగారు ఇద్దరూ.
ఏం చెప్పాలో తెలీలేదు. ఒక్క నిముషం కళ్ళు మూసుకుని విష్ణు మూర్తిని తలచుకున్నాను. వెంటనే సమాధానం స్ఫురించింది. కళ్ళు తెరచి, చిరునవ్వుతో వారిరువురికేసి చూసి
"నాయనలారా, శ్రీ మహా విష్ణువుకి సహస్ర నామాలు. ఆ నామాల్లో ఏ నామమైనా పెట్టుకోవచ్చు, ప్రజలకు నామం పెట్టకుండా." అని తాత్కాలికంగానైనా వివాదానికి తెర దించాను, చానల్ మారుస్తూ.
వాళ్ళడిగిన నామానికి, నేను చెప్పిన నామానికి నామమాత్రంగానైనా లంకె దొరక్క బుర్ర గోక్కుంటూ వుండిపోయారు ఇద్దరూ.
డిజర్వేషన్లు ఇస్తే చలితులు మతం మారరు. అవునా? – 10
5 months ago